Mana Enadu : ‘నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన ఇది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధేస్తుంది.’ అని వైఎస్ విజయమ్మ (YS Vijayamma) అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.
“నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. ఎంత అడ్డుకోవడానికి ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్లముందే జరిగిపోతున్నాయి. నా ఫ్యామిలీ గురించి ఇలా అబద్ధాలు మాట్లాడటం… నా పిల్లలిద్ధరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా కానీ రావాల్సిన పరిస్థితి.
ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో, మిమ్మల్ని అలాగే భావించారు. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేస్తున్నా. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు. మా కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. Blood is Thicker Than Water. వాళ్లు ఇద్దరు సమాధాన పడతారు. మీరెవరూ రెచ్చ గొట్టవద్దు.
రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక, 2009 నుంచి 2019 వరకు డివిడెండ్ రూపంలో జగన్ (YS Jagan) వాటా తీసుకొని, 200 కోట్లు షర్మిల భాగానికి ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం, షర్మిలకు 40 శాతం అయితే, MOUకు ముందు, సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు ఎందుకంటే షర్మిల (YS Sharmila)కు సమాన వాటా ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని.
2019 లో సీఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని జగన్ ప్రపోజల్ పెట్టాడు. ”పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత విజయవాడలో, నా సమక్షంలో, ఆస్తుల్లో ఇవి జగన్‌కి, ఇవి షర్మిలకి అని అనుకున్నారు. 2019 లో జగన్ నోటితో చెప్పి, ఆయన చేతితో రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే షర్మిలకి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. షర్మిలకు హక్కు ఉంది కాబట్టే MOU రాసుకున్నారు.
MOUలో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్‌గా ఇస్తున్నవి కాదు. బాధ్యతగా ఇస్తున్నవి. అటాచ్ మెంట్లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOUలో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, షర్మిలకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా, ఆటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిలకు అన్యాయం జరిగింది. నాకు ఇద్దరు బిడ్డలు సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకేలక ఇన్ని విషయాలు చెప్పాను. వాళ్లిద్దరు వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు. మరొక్కసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటున్నాను”.