ఏపీలో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటకు వస్తున్నారు. కొందరు రాజీనామాలు చేస్తూ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి (Vijaysai Reddy Resignation) కూడా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన శనివారం రోజున తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ (Chairman Dhankhad) కు అందజేశారు.
నెట్టింట సంచలన ప్రకటన
తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఆయన సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని.. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని స్పష్టం చేశారు. పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి (YS Family) రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
అందరికీ ధన్యవాదాలు
జగన్ కి (YS Jagan) మంచి జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పని చేశాను. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటూ విజయ్ సాయి రెడ్డి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.







