
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) యూజర్లకు మరో షాకిచ్చింది. సంస్థ నష్టాల్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై ఆర్థిక భారం పెంచుతోంది. క్రమంగా డెలివరీ ఛార్జీలు పెంచిన సంస్థ.. తాజాగా కొత్త ఛార్జీలు వసూలు చేస్తోంది. దూరానికి అనుగుణంగా ‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు’ను ప్రారంభించింది. అంటే యూజర్లు దూరంగా ఉన్న హోటల్/రెస్టారంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ మేరకు ఛార్జీలు కట్టాలి.
ఛార్జీల మోత ఇలా..
ఫుడ్ ఆర్డర్ పెట్టే స్థలం నుంచి సదరు రెస్టారెంట్ కానీ, హోటల్ కానీ 4 కిలోమీటర్ల అవతల ఉంటే ఆ ఆర్డర్లకు జొమాటో ‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు’ వర్తిస్తుంది. రెస్టారంట్, డెలివరీ అడ్రస్ మధ్య దూరం 4 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉంటూ ఆర్డర్ విలువ రూ.150 దాటితే కస్టమర్ల నుంచి రూ.15 వసూలు చేయనుంది. ఇక 6 కిలోమీటర్ల పరిధి దాటితే ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా నగరాన్ని బట్టి సర్వీస్ ఛార్జీలను రూ.25 నుంచి రూ.35 వరకు వసూలు చేయనుంది.
ఫ్రీ డెలివరీ నుంచి.. ఛార్జీలు.. ఇప్పుడేమో డిస్టెన్స్ ఛార్జీలు
కరోనా మహమ్మారి విజృంభనకు ముందు జొమాటోలో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న దూరానికి ఎలాంటి ఛార్జీలు ఉండేవి కాదు. కరోనా సమయంలో అనేక రెస్టారంట్లు తాత్కాలికంగా మూతపడగా.. ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. ఆ తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వస్తూ డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది. అయితే, డిస్టెన్స్ ఛార్జీ, సర్వీసు ఛార్జీ ఆర్డర్ విలువకు 30 శాతం మించకుండా చూసుకోవాలని రెస్టరంట్ పార్టనర్‌లకు జొమాటో సూచించింది.