నేటి నుంచి ఈ నెల 26 వరకూ తెలంగాణ(Telangana)లో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu) నేటి జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram)లో జరిగే ఈ పుష్కరాల కోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
రోజుకు లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే, ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు(Devotees) వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం రూ.35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని(Saraswati statue) ఏర్పాటు చేస్తున్నారు.

పుణ్య స్నానమాచరించిన పీఠాధిపతులు
పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరిస్తారని తెలంగాణ దేవాదాయశాఖ(Telangana Endowments Department) తెలిపింది. మే 15న మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, 19న నాసిక్ త్రయంబకేశ్వర్(Trimbakeshwar) మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి(Hampi) విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం ఆచరించనున్నారు.






