బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద కేసులు నమోదు చేసి విచారణ స్పీడప్ చేసింది. ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) బుధవారం ఉదయం బషీర్ బాగ్ లోని ED కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసర్లు ప్రకాశ్ రాజ్‌కు మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
వేల కోట్లు దండుకున్నారని, హవాలా మార్గంలో..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా (Rana), మంచు లక్ష్మి (Manchu Laxmi), ప్రణీత, నిధి అగర్వాల్ (Nidhi Agarwal), అనన్య సహా మొత్తం 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసింది. జంగిల్ రమ్మీ, జీత్ విన్ తదితర బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేశారని.. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయారని, మరి కొందరు సూసైడ్ చేసుకున్నారని ఆరోపణలున్నాయి. బెట్టింగ్ యాప్‌లు నిర్వహించేవారు వేల కోట్ల రూపాయలు దండుకున్నారని, హవాలా మార్గంలో పలువురికి డబ్బు పంపించారని సమాచారం. కోణంలో ED ఆరా తీస్తోంది.
6న విజయ్, 13న మంచు లక్ష్మి..
ఈ వ్యవహారంలో జులై 23న విచారణకు రావాలని నటుడు రానాకు గతంలో ఈడీ నోటీసు ఇవ్వగా… ఆయన గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని సూచించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.






