టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ ఏడాది తండేల్ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, నాగచైతన్య కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ NC 24గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో కీలకమైన గుహ సన్నివేశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ గుహ సెట్ నిర్మాణానికి సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఒక గుహ నుంచి మరో గుహకు కనెక్ట్ అయ్యే విధంగా, వేర్వేరు మెటీరియల్స్ ఉపయోగించి అత్యంత న్యాచురల్‌గా ఈ సెట్‌ను రూపొందించారు. ఈ గుహలో నిధి నిక్షేపాల కోసం వెతికే సీన్స్ చేస్తున్నారట చైతూ. దాదాపు 20 నిమిషాల పాటు గుహ నేపథ్యంలో సాగే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఓ అర్కియాలజిస్ట్ పాత్రలో ఆమె మెరవనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమా, నాగ చైతన్యకు పూర్తి విభిన్నమైన పాత్రను అందించబోతోందని టాక్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపై ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు సినిమాపై హైప్ తీసుకొచ్చేలా అప్ డేట్స్ వదలనున్నారట మేకర్స్.






