Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theatre Case) ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి రూ.2కోట్ల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) తరఫున రూ.కోటి.. పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడిస్తూ.. సంబంధిత చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.
శ్రీతేజ్ కోలుకుంటున్నాడు
ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju), పుష్ప 2 నిర్మాత రవి శంకర్‌తో కలిసి అల్లు అరవింద్ ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. బాలుడు తండ్రి భాస్కర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి శ్రీతేజ్ (Sritej Health Update) ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. వెంటిలేషన్ తీసేశారని చెప్పారు.
త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడు
బాలుడు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. లీగల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆ కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నానని చెప్పారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను 10 రోజుల క్రితం పరామర్శించానని వెల్లడించారు. ఆ సమయంలో వెంటిలేషన్‌పై ఉన్నాడని.. నిన్నటికి, ఈరోజుకి బాలుడి ఆరోగ్యం కాస్త మెగురుపడిందని పేర్కొన్నారు. అతడి హెల్త్ కండిషన్ బాగుందని వైద్యులు తెలిపారని వివరించారు.
రేపు సీఎంతో మీటింగ్
బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, ‘పుష్ప 2’ (Pushpa 2) నిర్మాతలు, దర్శకుడు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగామని వెల్లడించారు. సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని పేర్కొన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలం కలిసి వెళ్తామని.. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.







