ManaEnadu : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు(US Presidential Elections 2024) రంగం సిద్ధమైంది. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికకు మంగళవారం (నవంబరు 5వ తేదీ) పోలింగ్ జరగనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris).. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఓటేసిన 6.8 కోట్ల మంది
మరోవైపు పోలింగ్‌లో పాల్గొనేందుకు అమెరికా ఓటర్లు కూడా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే 6.8 కోట్ల మంది అమెరికన్లు ముందుగా ఓటేసే అవకాశాన్ని వినియోగించుకున్నారు. ముందస్తు ఓటింగ్ (US Polls 2024)కు ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ కేంద్రాలను పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు సృష్టించిందని అధికారులు తెలిపారు. న్యూయార్క్‌లోని 42 బ్రాడ్వేలో ఉన్న బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ కార్యాలయం ఈ ఏర్పాట్లలో బిజీగా ఉంది.
హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
మరోవైపు అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో హోరాహోరీగా సాగుతోంది. ట్రంప్ (Donald Trump) తనకు అనుకూలమైన నార్త్ కరోలినాలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు న్యూమెక్సికో, వర్జీనియాలనూ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నార్త్ కరోలినాలో ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. పత్రికలకు వ్యాసాలు రాయడం, టెలివిజన్ షోలలో హారిస్ పాల్గొంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థుల హవా
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్న విషయం తెలిసిందే. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, కార్నెల్ వెస్ట్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా.. గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టీన్, లిబర్టేరియన్ పార్టీ నుంచి చేజ్ ఓలివర్లు పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ (Democratic Party) మధ్యే కొనసాగే అవకాశం ఉంది.