
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan), అన్నాలెజినోవాల కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కుమారుడిని తీసుకుని పవన్, ఆయన సతీమణి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
తిరుమలలో పవన్ సతీమణి
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అన్నా లెజినోవా (Anna Lezhneva) శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే టీటీడీ అధికారి హరింద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
శ్రీవారి సేవలో అన్నా లెజినోవా
దర్శన చేసుకున్న తర్వాత అన్నాలెజినోవా(Anna Lezhneva Tirumala)కు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించనున్నారు.
గుండు చేయించుకున్న అన్నా లెజినోవా
అయితే శ్రీవారి దర్శనార్థం ఆదివారం రోజున తిరుమలకు చేరుకున్న అన్నాలెజినోవా .. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకుని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా భూవరాహ స్వామివారిని దర్శించుకుని రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.