
Mana Enadu : ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనతోపాటు వ్యూహం చిత్ర బృందం, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి లీగల్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి ‘వ్యూహం (Vyooham Movie)’ మేకర్స్ నిధులు పొందారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాలతో ఆర్జీవీ, వ్యూహం బృందానికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
15 రోజుల్లో వడ్డీతో సహా కట్టాలి
ఈ సినిమాకు సంబంధించి ఒక్కో వ్యూకు రూ.100 చెల్లించే నిబంధనలకు విరుద్ధంగా వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ (AP Fiber Net) నుంచి రూ.1.15 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారని ఈ మేరకు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ (YSRCP Govt) హయాంలోని ఫైబర్ నెట్ ఎండీతో సహా ఐదుగురుకి నోటీసులు జారీ చేశారు. రూల్స్ కు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రూ.2.15 కోట్లతో ఒప్పందం
ఇక వ్యూహం సినిమా సంగతికి వస్తే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ (RGV Vyuham) సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చిత్ర ప్రదర్శనను వ్యతిరేకిస్తూ చాలా మంది కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఈ సినిమా కోసం చిత్రబృందం రూ.2.15 కోట్లకు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుందని ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net MD GV Reddy) ఎండీ జీవీ రెడ్డి తెలిపారు.