తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం (Compensation) ప్రకటించింది. ఈ విషయాన్ని రాషఅట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా సానుభూతి ప్రకటించారు మంత్రి సత్యప్రసాద్.
ఈ ఘటన బాధాకరం
తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం అనగాని మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య? సమన్వయా లోపమా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు.
ఇదీ జరిగింది
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దుర్ఘటనపై తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో అధికారులు పేర్కొన్నారు.








