ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు (Intermediate Exams) తొలగించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఆ పరీక్షలకు ఈజీ ప్రిపరేషన్
చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని.. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని కృతికా శుక్లా తెలిపారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామని వెల్లడించారు. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు విద్యార్థులకు సులువుగా ఉంటుందని వివరించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగిస్తాం
“పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తీసుకొస్తాం. ఇందులో భాగంగానే ఇంటర్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలు తొలగించాలని అనుకుంటున్నాం. అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాం. సీబీఎస్ఈ విధానంలో ముందుకెళ్తాం. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26వ తేదీలోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపండి. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచాం’’ అని కృతికా శుక్లా పేర్కొన్నారు.








