మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అంటే ముందుగా గుర్తొచ్చేది డ్యాన్స్, స్టైల్. అలాగే సినిమాలో ఆయనే చేసే కామెడీకి కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘చంటబ్బాయి’, ‘శంకరదాదా ఎంబీబీఎస్’, ‘ముట మేస్త్రి’ లాంటి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. చిరు కామెడీని వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. చివరికి అది అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మెగా 157’ (Mega 157)సినిమా ద్వారా నెరవేరబోతోంది.
ఇటీవల చిరంజీవి కొన్ని సినిమాల్లో కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ, అభిమానులకు అది తక్కువగానే అనిపించింది. ఈసారి చిరు ఫుల్ కామెడీ సీన్స్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 157’ రూపంలో రాబోతోంది. ఇది మెగాస్టార్ 157వ సినిమా మాత్రమే కాదు, అనిల్ రావిపూడి లాంటి కామెడీ స్పెషలిస్ట్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా. రావిపూడికి డైలాగ్ టైమింగ్, సిచ్యువేషనల్ హాస్యంలో దిట్ట. ‘పటాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్3’ లాంటి సినిమాలు ఆయన కామెడీ టాలెంట్‌ను బాగా హైలైట్ చేశాయి.
‘మెగా 157’ సినిమాకు ప్రత్యేకత ఏమిటంటే, చిరంజీవి అసలు పేరు ‘శివ శంకర్ వరప్రసాద్’ పేరుతోనే దర్శనమివ్వనున్నారు. ఆయన పాత్ర – డ్రిల్ మాస్టర్ శివ శంకర్ వరప్రసాద్‌గా స్కూల్ నేపథ్యంతో ప్రేక్షకుల్ని అలరించనున్నట్లు సమాచారం. చిరు కెరీర్లో స్కూల్ సెటప్‌లో వచ్చే సినిమా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫుల్ కామెడీతో ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ ముస్సోరిలో శరవేగంగా జరుగుతోంది. స్కూల్ నేపథ్యంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవితో పాటు నయనతార, కేథరిన్ థ్రెసా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. దర్శకుడు రావిపూడి బృందం ఈ ఎపిసోడ్‌పై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.






