Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) వేళ ఇంటిల్లిపాది కలిసి వేడుక చేసుకుంటారు. ఈ పండుగ రోజున పిండి వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక సాయంత్రం లక్ష్మీదేవి పూజ అనంతరం పిల్లలూ, పెద్దలూ అంతా బాణాసంచా కాలుస్తారు. ఈ నేపథ్యంలో పండుగ పూట నిత్యావసర ధరలు, కూరగాయలు, బాణసంచాకు భారీగా డిమాండ్ ఉంటుంది.
పెరిగిన పండగ బడ్జెట్
అయితే ఈ దీపావళికి తారాజువ్వల్లా ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు (Groceries Price) సామాన్యుల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. బాంబుల్లా పేలుతున్న ధరలు మధ్యతరగతి వారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పండగ బడ్జెట్ 30నుంచి 40శాతం పైగా పెరిగిందని సామాన్యులు వాపోతున్నారు. ఇక పండుగ నేపథ్యంలో రెండు మూడు రోజుల నుంచి ధరలు మరింత పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పప్పుల ధరలు చూస్తే దడే
నాణ్యమైన బియ్యం (Rice Price) కిలో రూ.60పైనే పలుకుతుండగా.. పప్పులు రూ.100పైగా ఉన్నాయి. గతనెల శనగపప్పు కిలో రూ.64 ఉండగా.. ప్రస్తుతం అది రూ.100కు పైగా ఎగబాకింది. ఇక మినప్పప్పు రూ.125 నుంచి రూ.170కి, బెల్లం రూ.55 నుంచి రూ.70, లీటరు నూనె ధర రూ.134లకు చేరింది. మరోవైపు కూరగాయ ధరలు (Vegetables Price) కూడా సామాన్యలకు గాయం చేస్తున్నాయి. కిలో టమాట ధర రూ.40 వరకు ఉంది. దొండకాయ, క్యారెట్, బీర, బెండకాయ, వంకాయ, అన్నీ కిలో రూ.60 పైగా ఉన్నాయి.
ఏం కొనేటట్టు లేదు
ధరల పెరుగుదలతో అమ్మకాలు కుంటుపడ్డాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలోలలకు కిలోలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నారని తెలిపారు. మరోవైపు పండుగ పూట ధరలు చూస్తుంటే గుబులు పుడుతోందని వినియోగదారులు అంటున్నారు. దీపావళి వేళ భారీగా ధరలు పెరిగాయని వాపోతున్నారు.






