Mana Enadu : దేశవ్యాప్తంగా ప్రజలంతా దీపావళి (Diwali) వేడుకల్లో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. పండుగ పూట వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన కుటుంబ సభ్యులంతా ఒక చోటుకు చేరి వేడుక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దీపావళి వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
జిల్లాలోని ముజారియా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై టెంపో, పికప్ వ్యాన్ ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ముజారియా పోలీస్ స్టేషన్ సమీపంలో దిల్లీ- బదాయూ హైవేపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజాము 3 గంటలకు టెంపో, పికప్ వ్యాన్ ఢీ కొన్నాయి. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రమాదం జరిగిన తీరును గమనించారు.
వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురిని రక్షించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.






