
ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ఏకంగా 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేరళలో శనివారం నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రవేశించగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు, అండర్ పాస్ లు పూర్తి గా నీటితో నిండిపోయాయి.
ఆలస్యంగా నడస్తున్న విమానాలు
ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ (Traffic jam) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీట మునిగాయి. ఇవన్నీ కూడా విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉండటంతో ఎయిర్ పోర్టు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టులో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 49 విమానాలను దారి మళ్లించారు. మరో 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటన జారీచేశారు. ఫ్లైట్ రాకపోకలను ఆయా వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
వాతావరణ శాఖ (India Meteorological Department) రానున్న మరి కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా చెన్నై లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 13 జిల్లాలకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.