హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధిని సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇదే రద్దీ కంటిన్యూ అయితే వచ్చే ఏడాది ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
3 నెలల్లో 74 లక్షల ప్రయాణికులు
2024-25 ఏడాదిలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు (Hyderabad Airport) అరుదైన రికార్డు సృష్టించింది. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ విషయంలో హైదరాబాద్ మహానగరం.. జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాలను దాటేసిందని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఒక్కరోజే 94వేల మంది రాకపోకలు
రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్యను 75 వేలను కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది రాకపోకలు సాగించారు. హైదరాబాద్‌లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తున్నాయని అధికారులు ్ంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దుబాయ్, అబుధాబి, దోహా వంటి విదేశీ నగరాలకు అధికంగా ప్రయాణికులు వెళ్తున్నారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.






