జమ్మూకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని భావించిన పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరించింది. కానీ ఎప్పటిలా భారత్ ఈ దాడిని దాడితో తిప్పకొట్టలేదు. ఈసారి వాళ్లు ఊహించని షాక్ ఇచ్చింది. అదే సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ (Indus Waters Treaty) చేయడం. గతంలో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినప్పుడు, ఆ దేశం మనపై దాడి చేసినప్పుడు కూడా భారత్ దయతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. కానీ నిరాయుధులైన పర్యటకులపై దాడికి తెగబడి భరతమాత సహనం కోల్పోయేలా చేసిన పాక్ కు వాళ్ల స్టైల్ లోనే బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయింది.
సహనం కోల్పోయిన భారత్
అందుకే పాకిస్థాన్ కు జీవనాడి అయిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదుల నీటిని ఈ రెండు దేశాలు పంచుకున్నాయి. ఈ క్రమంలోనే సింధు (Sindhu River), జీలమ్, చీనాబ్ నదుల నీరు పాకిస్థాన్ కు దక్కాయి. వీటితో పాటు బియాస్, సట్లెజ్ జలాలు కూడా ఆ దేశానికి వెళ్తుంటాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటికి పాక్ కు సరిపోయేలా మాత్రమే వినియోగించాలి. కానీ దాయాది దేశానికి మాత్రం ఈ జలాలే జీవనాడులు. అందుకే ఎన్ని యుద్ధాలు జరిగినా భారత్ ఈ ఒప్పందం జోలికి ఎప్పుడూ వెళ్లలేదు.
పాక్ కు ఇక చుక్కలే
తాజా ఉగ్రదాడితో సహనం కోల్పోయిన భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ ను పూర్తిగా ఎడారిగా మార్చేస్తోంది. ఆ దేశంలోని ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలపైనే ఆధారపడతారు. వ్యవసాయానికి అవసరమయ్యే నీటిలో 80 శాతం ఈ ఒప్పందం కింద లభించేవే. కానీ ఇప్పుడు ఇది రద్దు చేయడంతో పాకిస్థాన్ భవిష్యత్ అంధకారం కాబోతోంది. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం పాకిస్థాన్ పై తక్షణమే కనిపించకపోవచ్చు. ఒకేసారి నీటి ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాదు.. కానీ తక్షణమే 5 నుంచి 10 శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు. ఎలా చూసుకున్నా భారత్ నిర్ణయంతో పాకిస్థాన్ కు చుక్కలు కనిపించబోతున్నట్టే.






