సంక్రాంతి పండుగ (Sankranti 2025) వచ్చేస్తోంది. నగరంలో వృత్తి, విద్య, ఉపాధి నిమిత్తం సెటిల్ అయిన వాళ్లంతా పండుగకు ఊళ్ల బాట పడుతున్నారు. కుటుంబంతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కా ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఇంటి ముందు రంగవళ్లులు, బోగి మంటలు, హరిదాసు కీర్తనలు, అమ్మ చేసే మిఠాయిలు, డాబాపైకి వెళ్లే ఎగురవేసే పతంగులు. పల్లెల్లో ఉంటే ఈ పండుగను ఎంతో సరదాగా జరుపుకోవచ్చు.
స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్
కానీ పట్టణాలు, నగరాల్లో ఉన్న వారిందరికీ సంక్రాంతిని ఘనంగా జరుపుకునే వీలుండకపోవచ్చు. అందుకే ఈ పండుగ పూట కుటుంబంతో కలిసి జాలీగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం తీసుకువస్తోంది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (Kite Festival). ప్రతి ఏడాది లాగే ఈ సంక్రాంతి పండుగకూ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ (International Kite And Sweet Festival)ను మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు.
50 దేశాలకు.. 150 మంది ఫ్లయర్స్
వివిధ రాష్ట్రాలకు చెందినవారు స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటారని మంత్రి జూపల్లి (Minister Jupally) తెలిపారు. ఇండోనేషియా, శ్రీలంక, కాఠ్మాండూ, స్కాట్లాండ్, మలేసియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ సహా మొత్తం 50 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మూడు రోజులు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని.. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫెస్టివల్ ఉంటుందని చెప్పారు.







