
చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగాన్ని విజయవంతం చేసి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భారత అంతరిక్ష రంగంలోనే ఓ మైలురాయి. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఈ ఘనతను మన దేశం సొంతం చేసుకుంది.
చంద్రయాన్-4పై అప్డేట్
ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటూ ప్రపంచమంతా భారత్ వైపు చూసింది. కానీ దూకుడు మీదున్న ఇస్రో వరుస ప్రాజెక్టులు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందులో ఒకటే చంద్రయాన్-4 మిషన్ (Chandrayaan 4). ఈ మిషన్ కోసం కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మిషన్ పై తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. 2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగించనున్నట్లు భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
చంద్రయాన్4 లక్ష్యం అదే
2027లో భారతదేశం ప్రయోగించనున్న చంద్రయాన్-4 మిషన్‌తో.. చంద్రుడి నుంచి భూమికి రాళ్ల నమూనాలను (Samples of Rocks) తీసుకువస్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జితేంద్ర వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగంగా హెవీ లిఫ్ట్ LVM-3 రాకెట్‌ను రెండు సార్లు అయినా ప్రయోగించనున్నట్లు చెప్పారు. ఈ రాకెట్ ద్వారా 5 కంపోనెంట్స్‌ను స్పేస్‌లోకి తీసుకెళ్లి మిషన్‌ను విజయవంతం చేసేందుకు కక్ష్యలో వాటిని అసెంబుల్ చేయనున్నట్లు పేర్కొన్నారు.