Mana Enadu: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) ఇవాళ మరోసారి ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు మోదీ నేటి గుజరాత్ పర్యటనలోనూ ఒకే దేశం-ఒకే ఎన్నిక(One nation-One election) కచ్చితంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశమంతటా ఎన్నికలను ఒకేరోజు నిర్వహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjuna Kharge) స్పందించారు. పార్లమెంటులో ఏకాభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని తేల్చారు.
ప్రజలను మోసం చేసేందుకే..
ప్రధాని మోదీ ఏం చెప్పారో అది చేయలేరని ఖర్గే అన్నారు. ఎందుకంటే జమిలి ఎన్నికల(Jamili elections)కు సంబంధించిన బిల్లు పార్లమెంటు(Parliament)కు వచ్చినప్పుడు అందరి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా చేస్తేనే ఇది ముందుకు కదులుతుందన్నారు. కానీ అది సాధ్యపడదు. అసలు జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ఖర్గే తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం అనేక రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతో పాటు అనేక సమస్యలతో ముడిపడి ఉందన్నారు. మోదీ తాను చేయాల్సిన పనులనే చేయట్లేదని. ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
విపక్షాలపై ప్రధాని విమర్శలు
ఇదిలాఉండగా సర్దార్ వల్లభభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి రానున్నాయని ప్రధాని మోదీ అన్నారు. వీటిని ఎవరూ కూడా అడ్డుకోలేరని ప్రధాని స్పష్టం చేశారు.