ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కీలకమైన నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. భారత దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) (1625 పరుగులు) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (1630 పరుగులు) అధిగమించి అగ్ర స్థానంలో నిలిచాడు. అంతకుముందు తమ దేశానికే చెందిన అలిస్టర్ కుక్ రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానానికి వచ్చాడు.
ఇంగ్లాండ్, కివీస్ (New Zealand vs England) జట్ల మధ్య న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ నడుస్తోంది. ఆదివారం జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో జో రూట్ 23 పరుగులు చేసి తద్వారా నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. సచిన్ తెందూల్కర్ 60 ఇన్నింగ్స్‌లో 1625 పరుగులు చేయగా.. రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ చేరుకున్నాడు. కెరీర్‌లో 150 టెస్టులు ఆడిన జో 35 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12,777 రన్స్ చేశాడు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో రూట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌తో (New Zealand) జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ (England) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 254 పరుగులకు ఆలౌటైంది. బ్రైడన్ కార్స్ 6 వికెట్లతో చెలరేగాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. డారిల్ మిచెల్ (84), విలియమ్సన్ (61) మాత్రమే రాణించడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో కివీస్‌ను 348 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్.. ఆ ఇన్నింగ్స్‌లో 499 రన్స్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ మరోసారి తక్కువ స్కోరు(254)కే పరిమితం చేసిన ఇంగ్లాండ్.. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో నాలుగో రోజే తొలి టెస్టు మ్యాచ్ ముగిసింది.