భారత ప్రతిష్ఠాత్మక సంస్థ కంప్ట్రోలర్ అండ్ జనరల్ (కాగ్) (CAG)బాధ్యతలను తెలుగు వ్యక్తి కొండ్రె సంజయ్ మూర్తి (Sanjay Murthy) చేపట్టారు. కాగ్ అధిపతిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ కుమారుడే సంజయ్. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన ఇంజినీరింగ్ పూర్తిచేసి ఆ తర్వాత సివిల్స్ సాధించారు. ఐఏఎస్ (IAS) అధికారిగా 1989లో హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికై సమర్థంగా విధులు విర్వహించారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబర్ నుంచి విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖలో కార్యదర్శిగా పనిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో కీలక పాత్ర పోషించారు.
సంజయ్ మూర్తి ఈ డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కాగ్ అధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు లేదా, 65 ఏళ్ల వయసు వరకు కొనసాగేందుకు వీలుంది. గతేడాది నవంబరు 20 కాగ్ అధిపతిగా గిరీష్ చంద్ర ముర్ము పదవీ విరమణ చేయగా ఆ స్థానాన్ని సంజయ్ మూర్తి తాజాగా భర్తీ చేశారు.
At a ceremony in the Ganatantra Mandap, Rashtrapati Bhavan, today at 10:00 AM, Shri K. Sanjay Murthy was sworn in as the Comptroller and Auditor General of India. He took the oath of office before the Hon’ble President.@rashtrapatibhvn #CAG #India #Governance pic.twitter.com/EQ1tH9tZbi
— Sudarshan Northeast (@SudarshanNewsNE) November 21, 2024






