బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు డెత్ థ్రెట్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan Attack) పై తన ఇంట్లోనే దుండగుడు దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం ఇప్పుడు ఆందోళనకరంగా మారిందంటూ పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి.
సెలబ్రిటీలకు థ్రెట్
కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షోతో పాపులర్ అయిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)తో పాటు మరో కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్, స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజా (Remo Dsouza)కు హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ బెదిరింపులపై రాజ్‌పాల్ యాదవ్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
మెయిల్ లో ఏం ఉందంటే..?
‘‘మేము మీ ప్రతి మూమెంట్ ను గమనిస్తున్నాం. ఇది మేం చేసే పబ్లిక్ స్టంట్ కాదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మిమ్మల్ని వేధించడం కోసం చేసే ప్రయత్నం కాదిది. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి’’ అని ఈ-మెయిల్‌లో రాసి ఉన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఎనిమిది గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని బెదిరించిన బ్లాక్ మెయిలర్ ఆ డిమాండ్లు ఏంటో చెప్పకపోవడం గమనార్హం.






