
విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) గత నెల జులై 13న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే, ఆయన సతీమణి కోటా రుక్మిణి(Kota Rukmini) కూడా సోమవారం (ఆగస్టు 18) హైదరాబాద్లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. భర్త మరణం ఆమెను తీవ్రంగా కలచివేసిందని, దీనితో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రుక్మిణి గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల(Health problems)తో బాధపడుతున్నారు. 1973లో ఆమె డెలివరీ సమయంలో తల్లి మరణం, 2010లో కుమారుడు వెంకట ఆంజనేయ ప్రసాద్(Venkata Anjaneya Prasad) రోడ్డు ప్రమాదంలో మరణించడం వంటి విషాదాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి.
భర్త మరణం తట్టుకోలేక..
ఈ ఘటనలు ఆమెను దాదాపు 30 ఏళ్లపాటు తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని కోటా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోటా శ్రీనివాస రావు తన భార్య ఆరోగ్యం కోసం అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ, ఆమె భర్త మరణం తట్టుకోలేకపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో విషాద ఛాయలు అలముకుంది. సినీ ప్రముఖులు కోటా నివాసానికి వెళ్లి రుక్మిణి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ విషాదం కోటా కుటుంబానికి, సినీ అభిమానులకు తీరని లోటుగా మిగిలింది.