మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు (Maharashtra election 2024) విడుదలవుతున్నాయి. ఎన్డీయే (NDA) కూటమి మహాయుతి ఆధిక్యంలో దూసుకుపోతోంది. శనివారం ఉదయం నుంచి ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. 288 స్థానాలకు గానూ 212 స్థానాల్లో మహాయుతి లీడింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాతీర్పు కాదని, ఈవీఈఎంలను ఎన్డీయే కూటమి ట్యాంపర్ చేసిందని ఆరోపించారు.
ఎన్నికల ఫలితాలపై మీడియాతో సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ ‘ఎంవీఏ కూటమి కనీసం 75 స్థానాల్లో కూడా ఆధిక్యంలో లేదు. ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది మరాఠీలు, రైతుల తీర్పు కాదు.’ అని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘అజిత్ పవార్, షిండే చేసిన ద్రోహంపై మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మా (ఎంవీఏ) కూటమికే మెజార్టీ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఎలా మారుతాయి. కచ్చితంగా ఎన్డీయే కూటమి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడింది’ అని వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఫలితాల్లో ఎన్డీయే హవా కొనసాగుతోంది. దాదాపు 210 స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 145 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాలు, ఇతర చోట్ల స్వీట్లు పంచుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు. ఇక జార్ఖండ్‌లో (jharkhand election 2024) జేఎంఎం కూటమి దూసుకుపోతోంది. మొత్తం 81 స్థానాల్లో 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భాజపా కూటమి 30 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ రెండో స్థానంలో ఉంది.