Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుండగా, ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి భావోద్వేగంతో మాట్లాడారు.
వారణాసిలో మహేశ్‌బాబు డ్యూయల్ షేడ్స్‌లో నటిస్తుండగా, ముఖ్యంగా రుద్రుడి పాత్రలో ఆయన నటన వేరే స్థాయిలో ఉంటుందని రాజమౌళి తెలిపారు.“రాముడిగా మహేశ్‌బాబు నవ రసాలను అద్భుతంగా ప్రదర్శించాడు. అభిమానులు ఇప్పటి వరకు చూడని మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారు” అని ఆయన ప్రశంసించారు. మహేశ్‌బాబు కోసం ప్రత్యేకంగా రాముడి గెటప్‌లో ఫోటో షూట్ కూడా చేశామని, దానికి సంబంధించిన సన్నివేశాలను 60 రోజులు చిత్రీకరించినట్లు వెల్లడించారు.“ఆ ఫోటోను నా ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నా… ఎవరో లీక్ చేస్తారేమోనన్న భయంతో తిరిగి తీసేశా” అని నవ్వుతూ చెప్పారు. మహేశ్ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ..ఈ రోజుల్లో మనలో చాలామంది ఫోన్ లేకుండా ఉండలేరు. కానీ మహేశ్‌బాబు సెట్స్‌కు వచ్చాక సుమారు ఎనిమిది గంటలు కూడా ఫోన్ చూడరు. ఫోన్‌ను కారు లోపలే వదిలేస్తారు. ఈ లక్షణం నేనూ నేర్చుకోవాలని కోరుకుంటున్నా అని రాజమౌళి అన్నారు.
వారణాసిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాటల్లో చెప్పలేం. ప్రేక్షకుల అంచనాలు పెంచకుండా, కథను రివీల్ చేయకుండా వీడియో ద్వారా మాత్రమే చెప్పాలని నిర్ణయించుకున్నాం” అని రాజమౌళి వెల్లడించారు. మార్చిలో ఈ ఈవెంట్‌ను జరపాలని అనుకున్నా, వర్షాల కారణంగా నవంబర్ 15కి వాయిదా వేసినట్లు చెప్పారు.సినిమా టెస్టు ప్లే చేసినప్పుడు డ్రోన్లతో తీసి నెట్లో పెట్టేయడంతో ఈసారి ఏ రిస్క్ కూడా తీసుకోకుండా జాగ్రత్త పడ్డామని రాజమౌళి అన్నారు.





