Mana Enadu : దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు నెమరు వేసుకుందాం. దేశం కోసం ఎంత సేవ చేసినా.. ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినా.. ఆయన పాలనలో ఆయణ్ను బాధపెట్టిన అంశాలు కూడా ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలం పాటు ఆయన ప్రధానిగా దేశాన్ని నడిపించారు. ఈ సందర్భంగా 2014లో ప్రధానమంత్రి హోదాలో ఆయన చివరి ప్రెస్ మీట్ నిర్వహించారు.
మన్మోహన్ పాలనలో గుడ్-బ్యాడ్
తన చివరి ప్రెస్ మీట్ లో మన్మోహన్ సింగ్ (Manmohan Singh Last Press Meet) ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మీ పాలనలో మీకు ఎదురైన అత్యుత్తమ, ఆవేదనాభరిత అంశాలేమిటని ప్రశ్నించగా వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కాస్త సమయం కావాలంటూనే తన మనసులోని విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన పాలనలో అత్యుత్తమం అనుకున్నవి, పశ్చాత్తపడిన అంశాలు ఏంటో ఆయన మాటల్లోనే..
చాలా చేద్దామనుకున్నా
‘‘అమెరికాతో పౌర అణు (US India Nuclear Agreement) ఒప్పందం నా జీవితంలో బెస్ట్ అంశం.’’ అని మన్మోహన్‌సింగ్ తెలిపారు. ఇక తాను పశ్చాత్తపపడిన విషయం గురించి మాట్లాడుతూ.. ఈ విషయంపై మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. ‘కచ్చితంగా వైద్య, ఆరోగ్య రంగం, స్త్రీ, శిశు ఆరోగ్య సంరక్షణకు చాలా చేద్దామనుకున్నాను. అందులో భాగంగానే జాతీయ ఆరోగ్య కార్యక్రమం (National Health Program) మొదలుపెట్టాం. కొంతవరకు మంచి ఫలితాలు సాధించాం. కానీ, మరింత చేయాల్సింది ఉంది.’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఇక తన పాలనలో ప్రధానమంత్రిగా ఆయన దాదాపు 114 ప్రెస్ మీట్లు నిర్వహించారు.






