
Mana Enadu : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) అల్లర్లు ఆగడంలేదు. రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా ఏడాదిన్నరగా ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Manipur CM Biren Singh) ఇంటి వద్దే బాంబు కనిపించడం కలకలం రేపింది.
51 ఎంఎం మోర్టార్ బాంబ్
రాష్ట్ర రాజధాని ఇంపాల్లోని కొయిరెంగేయ్ ప్రాంతంలో ఉన్న సీఎం బీరేన్ సింగ్ (Biren Singh) ప్రైవేట్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 51 ఎంఎం మోర్టార్ బాంబును (Mortar Bomb) నిర్వీర్యం చేశారు. ఆ బాంబును మంగళవారం రాత్రి ప్రయోగించి ఉంటారని, అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఎవరు ప్రయోగించారు?
ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.