కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమైన అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఎట్టకేలకు తండేల్ చిత్రంతో ఓ హిట్ కొట్టాడు. థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాల మిగిల్చిన పరాజయాల నుంచి డైరెక్టర్ చందూ మొండేటి తండేల్ సినిమాతో చైతూను గట్టెక్కించాడు. సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
తండేల్ కు పైరసీ బ్రేక్
పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకు పైరసీ (Thandel Piracy Movie) భూతం బ్రేక్ వేసింది. సినిమా రిలీజ్ అయి 24 గంటలు గడిచిందో లేదో .. అలా ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. Movie Rulez, ఫిల్మి జిల్లా వంటి పలు ఆన్లైన్ పైరసీ వెబ్సైట్లలో ఈ సినిమా హెచ్డీ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలను పైరసీ భూతం వెంటాడిన విషయం తెలిసిందే. తాజాగా తండేల్ చిత్రానికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
తండేల్ కలెక్షన్లపై పైరసీ ప్రభావం
మొదటి రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రాబట్టిన తండేల్ (Thandel Day 1 Collections) సినిమాపై ఇప్పుడు ఈ పైరసీ ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఈ సినిమా లీక్ అవ్వడంపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ ‘తండేల్ సినిమాను థియేటర్లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే పైరసీ వెబ్ సైట్లలో నుంచి ఆ చిత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.






