సినిమా హీరోలంటే మూవీ లవర్స్ కు ఓ రేంజులో ప్రేమ ఉంటుంది. కొందరి ప్రేమ, ఆరాధన కాస్త పరిధులు దాటి హద్దులు మీరుతూ అటు హీరోలకు ఇటు తమ కుటుంబాలకు నష్టం చేకూర్చుతుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంటే ఏకంగా దేవుళ్లన్న భావన కొందరు అభిమానులకు ఉంటుంది. అందుకే తమ ఫేవరెట్ నటులపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు అప్పుడప్పుడు సాహసాలు చేస్తుంటారు.
తారక్ పై ఎనలేని అభిమానం
ఇక టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR). ఆయనంటే చాలా మందికి ఎంతో అభిమానం. ఏకంగా ఆయన సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పది లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారంటే ఆయనుకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తారక్ కు కూడా తన అభిమానులంటే అంతే ఆప్యాయత. ఆయన ఎల్లప్పుడు వారి క్షేమాన్నే కోరతారు.
పాదయాత్రలు చేయొద్దు
అందుకే ఏదైనా ఈవెంట్ జరిగితే వెళ్లేటప్పుడు అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్లమని మరీ మరీ చెబుతుంటారు. సినిమా హీరోల కోసం లైఫ్ ను పాడు చేసుకోవద్దంటూ సూచిస్తుంటారు. తాజాగా తారక్ మరోసారి తన అభిమానులను (NTR About Fans) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను చూసేందుకు పాదయాత్రలు వంటివి చేసి రావొద్దని సూచించారు.
త్వరలోనే ఫ్యాన్ మీట్
తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్న ఆయన త్వరలో వారి కోసం ఫ్యాన్ మీట్ (NTR Fan Meet )ఈవెంట్ ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలా వ్యక్తిగతంగా తానే తన అభిమానుల వద్దకు వస్తానని మాటిచ్చారు. ఇందుకోసం పోలీసులు, ఇతర అధికారుల అనుమతి తప్పక తీసుకుంటానని చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్త తీసుకుంటామని వెల్లడించారు.
కాస్త టైం ఇవ్వండి
అయితే ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తారక్ అన్నారు. తనను కలిసేందుకు వచ్చే అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లే బాధ్యత తనపై ఉన్నందున ఆ దిశగా కార్యక్రమం విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందని తెలిపారు. అందుకే ఈ ఈవెంట్ కు కాస్త సమయం అవసరం అవుతుందని.. అప్పటి వరకు అభిమానులు కాస్త ఓపికగా ఉండాలని కోరారు.






