2006లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘స్టాలిన్’(Stalin) మళ్లీ ఓ సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా, అప్పట్లోనే మంచి సందేశాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఈ చిత్రం 4K వర్షన్లో రీరిలీజ్ కానుంది.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా యూత్‌లో మంచి ఆలోచనలు రేకెత్తించేలా ఉందని ఆయన అన్నారు.

స్టాలిన్ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అనుష్క కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమా ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది.
ఈ చిత్రానికి నంది అవార్డు (స్పెషల్ జ్యూరీ అవార్డు) లభించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా, స్టాలిన్ తర్వాత చిరంజీవి–త్రిష కాంబినేషన్ మళ్లీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ కానున్న విషయం తెలిసిందే. సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిరు అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.






