
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
పెండింగ్ లో ఉంచడం సరికాదు
ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్ లో ఉంచడం సరికాదన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. విచారణ పొడిగించేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది.
అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి.జగదీష్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.