ఈ ఏడాది 2025 ఆస్కార్ వేడుకలో (Oscar Awards 2025) అత్యధికంగా ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న సినిమా ‘అనోరా (ANORA)’. ఒకే సినిమాకు గానూ నాలుగు (ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడు) పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా డైరెక్టర్ సీన్ బేకర్ రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అనోరా సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఆస్కార్ గెలిచే అంతలా ఈ చిత్రంలో ఏం ఉందా అని మూవీ లవర్స్ దీనికోసం సర్చ్ చేస్తున్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ సినిమా స్టోరీ ఏంటి? ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది వంటి వివరాలు తెలుసుకుందాం.
Three Oscars. What about four? Or five? #Oscars
Congratulations to ANORA, this year’s Best Picture winner! pic.twitter.com/Nt3Q2Ta405
— The Academy (@TheAcademy) March 3, 2025
అనోరా.. ఓ వేశ్య కథ
హాలీవుడ్ అనగానే అందరికీ మదిలో మెదిలేది భారీ బడ్జెట్ చిత్రాలు, ఫుల్ ఆన్ యాక్షన్ మూవీస్. కానీ ఇంగ్లీష్ లోనూ మదిని తొలిచే చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి జానర్ లోనే డైరెక్టర్ సీన్ బేకర్ డిఫరెంట్ కథతో అనోరా చిత్రాన్ని తెరకెక్కించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+ లో అందుబాటులో ఉంది.
అనోరా స్టోరీ ఏంటి?
23 ఏళ్ల ‘అని’ అనే వేశ్య చుట్టూ తిరిగే స్టోరీయే అనోరా సినిమా కథ. బ్రూక్లిన్లో నివసించే అని, వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కొడుకు వన్యను కలుస్తుంది. వేశ్యతో అతడు గాఢంగా ప్రేమలో పడతాడు. అంతే కాకుండా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు వేశ్యను వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది.
చివరకు రష్యాలో నివసిస్తోన్న వన్య పేరెంట్స్ కు ఈ విషయం తెలియగా.. వారు తమ కుమారుడికి మాయమాటలు చెప్పి అని పెళ్లి చేసుకుందని ఆరోపిస్తారు. 10వేల డాలర్లు ఇస్తామని, తమ కొడుకును వదిలేయాలని డిమాండ్ చేస్తారు. మరి అని వన్య పేరెంట్స్ ఆఫర్ ను అంగీకరించిందా..? వన్యను వదిలేసిందా..? వన్య-అని లవ్ స్టోరీ ఏమైంది..? అని లైఫ్ ఎలాంటి మలుపు తిరిగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.






