జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతావని నిప్పులు కురిపిస్తోంది. ఆ దేశంతో అన్ని సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అదే భావిస్తున్నట్లు పాకిస్థాన్ తో అన్ని సంబంధాలకు గుడ్ బై చెప్పే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పాకిస్థాన్ కు మరో షాక్
ఇప్పటికే దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించి న్యూఢిల్లీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని (Sindhu Water Agreement) కూడా సస్పెండ్ చేసింది. దీంతో పాక్ లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారనున్నాయి. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న పాక్ పౌరులంతా రెండ్రోజుల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాక్ ఎక్స్ ఖాతా సస్పెండ్
పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతా (Pakistan Government X Account)ను భారత్‌లో నిలిపివేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ ఖాతాను భారత్‌లో నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ను అభ్యర్థించగా ఆ సంస్థ పాక్ (Pakistan) ప్రభుత్వ ఖాతాను భారత్‌లో సస్పెండ్ చేసింది. దీంతో అందులోని కంటెంట్‌ను ఇక్కడి యూజర్లు చూడలేరు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పాక్ తో ఉన్న అన్ని సంబంధాలకు కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతోంది.






