
ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) వేడుకగా చేసుకున్న బర్త్డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. తన పుట్టినరోజు సందర్భంగా మంగ్లీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఓ రిసార్టులో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చింది. సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. నటి దివి, రైటర్ కాసర్ల శ్యామ్, రచ్చ రవి, మంగ్లీ చెల్లి సింగర్ ఇంద్రావతి వేడుకల్లో ఉన్నట్లు సమాచారం.
9 మందికి గంజాయి పాజిటివ్
అయితే పార్టీలో డ్రగ్స్ వాడుకున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో సదరు రిసార్టుపై దాడులు చేశారు. కాగా వేడుకల్లో గంజాయితోపాటు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి వచ్చిన వారిలో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగ్లీపై కూడా కేసు నమోదు చేశామన్నారు.