
భారత అంతరిక్ష రంగం(Indian space sector)లో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(IAF Group Captain Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ హిస్టారికల్ మూమెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భాగంగా శుక్లా ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు.
శుక్లా ప్రయాణం దేశ ప్రతిష్ఠను మరింత పెంచింది: మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Modi) మాట్లాడుతూ.. శుభాంశు శుక్లా ప్రయాణం దేశ ప్రతిష్ఠను మరింత పెంచిందని కొనియాడారు. “మీరు మిషన్(Mission) కోసం భౌతికంగా దేశానికి దూరంగా ఉన్నప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల(Indians) హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు. మీ ఈ చారిత్రక యాత్ర ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. ఇది మన దేశ మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్(Gaganyaan)’కు మొదటి అడుగు వంటిది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే భారత విద్యార్థుల ఆకాంక్షలకు మీ విజయం మరింత బలాన్నిస్తుంది” అని శుక్లాను ఉద్దేశించి ప్రధాని అన్నారు. ఈ ప్రయాణం వికసిత భారత్(Vikasith Bharath) లక్ష్యానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
I had a wonderful conversation with Group Captain Shubhanshu Shukla as he shared his experiences from the International Space Station. Watch the special interaction! https://t.co/MoMR5ozRRA
— Narendra Modi (@narendramodi) June 28, 2025
ఇది నా ఒక్కడి విజయం కాదు: శుభాంశు శుక్లా
ప్రధాని ప్రశంసలకు శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) వినమ్రంగా స్పందించారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, యావత్ భారతదేశం సాధించిన సమష్టి విజయమని అన్నారు. “భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉంది. ఇక్కడి నుంచి మన దేశాన్ని మొదటిసారి చూసినప్పుడు, మ్యాప్(Map)లో చూసిన దానికంటే ఎంతో పెద్దదిగా, మహోన్నతంగా కనిపించింది. ఈ భూమి అంతా ఒకే ఇల్లు, మనమంతా ఒకే కుటుంబం అనే భావన కలుగుతోంది. ఇక్కడి నుంచి చూస్తే దేశాల మధ్య సరిహద్దులు, విభజన రేఖలు కనిపించవు, అంతా ఏకత్వమే కనిపిస్తుంది” అని తన అనుభూతిని పంచుకున్నారు.
కాగా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వాయుసేనకు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నీవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబర్ కపు ఈ బృందంలో ఉన్నారు. వీరు 14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో సేవలందించనున్నారు.