Mana Enadu : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’. ఈ సినిమా గురువారం (డిసెంబరు 5) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా గంగమ్మ జాతర సీక్వెన్స్ (Pushpa 2 Jatara Scene) లో బన్నీ యాక్షన్, పర్ఫామెన్స్ కు నీరాజనాలు పడుతున్నారు. ఈ సీన్ లో బన్నీ లేడీ గెటప్ లో కనిపించాడు. చీరకట్టి అమ్మవారి అవతారంలో అపరకాళీలా కనిపించి థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు.
ఈ సినిమా చూసి అందరూ అసలు ఏంటీ గంగమ్మ జాతర (Pushpa 2 Gangamma Jatara).. ఈ జాతరలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారు..? మగవాళ్ల చీర కట్టుకోవడం ఏంటి..? ఆడవాళ్ల మగరాయుళ్లా అయిపోవడమేంటి..? అసలు ఈ అమ్మోరు, రాక్షసుల గెటప్పులు ఏంటి? అని తెగ సెర్స్ చేస్తున్నారు. మరి గంగమ్మ జాతరలో లేడీ గెటప్పుల వెనుక ఉన్న కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
లేడీ గెటప్పుల్లో.. అమ్మవారి వేషధారణలు అంటే గంగమ్మకు మహా ఇష్టమట. ఇలా అమ్మను దర్శించుకుంటే ఆ తల్లి చల్లనిచూపు కలకాలం ఉంటుందని తిరుపతిలోని గంగమ్మ భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా డిసెంబరులో ఈ గంగమ్మ జాతర చర్చ షురూ అవుతుంది. ఈ నెల రెండో ఆదివారం అర్ధరాత్రి జాతర గురించి చాటింపు చేసి తేదీలు ప్రకటిస్తారు. మే నెల మొదటి వారంలో అసలు జాతర జరుగుతుంది.
గంగమ్మ ఎవరంటే..?
తిరుపతిలో కొలువుతీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్లలో ఒకరే గంగమ్మ. వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించి ఈ అమ్మవారికి పూజలు చేస్తారు. టీటీడీ తరఫున అమ్మకు పట్టువస్త్రాలు కూడా సమర్పిస్తారు. మే నెల మొదటి మంగళవారం అర్ధరాత్రి కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు వేసిన తర్వాత ఈ జాతర షురూ అవుతుంది. ఆ తర్వాత వచ్చే మంగళవారం రోజున ముగుస్తుంది. జాతర జరిగే వారం రోజులు ఎవరూ పొలిమేర దాటి బయటకు వెళ్లరు.
లేడీ గెటప్పుల వెనకున్న స్టోరీ ఇదే
తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకుని గంగమ్మ అని నామకరణం చేశాడు. ఆ సమయంలో రాయలసమీలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తోంది. అప్పట్లో మహిళలపై వారి అఘాయిత్యాలు ఎక్కువగా ఉండేవి. అయితే దత్తతు తీసుకున్న తల్లిదండ్రుల సంరక్షణలో ఎంతో అపురూపంగా పెరిగిన గంగమ్మపై ఓరోజు ఓ పాలెగాడు కన్నేసి చెరబట్టేందుకు చూడగా అతణ్ని ఉగ్రరూపంతో వెంటాడింది గంగమ్మ.
గంగమ్మ ఉగ్రరూపం చూసి భయపడ్డ పాలెగాడు ఎక్కడో దాక్కున్నాడు. అతణ్ని బయటకు రప్పించేందుకు ఆమె వివిధ రకాల వేషధారణలు ధరించి వెతకడం ప్రారంభించింది. బైరాగి, మాతంగి, చివరకు దొర వేషంలోనూ తిరిగంది. అలా ఓనాడు దొర వేషంలో వచ్చిన గంగమ్మకు పాలెగాడు దొరికాడు. అతడిని సంహరించిన గంగమ్మ ఆ తర్వాత మాతంగి వేషధారణలో పాలెగాడి భార్య వద్దకు వెళ్లి ధైర్యం చెబుతుంది. అప్పటి నుంచి గంగమ్మను శక్తి స్వరూపంగా ఆ ప్రాంత ప్రజలు కొలుస్తూ వస్తున్నారు. అందుకే గంగమ్మ జాతరలో ఈ లేడీ గెటప్పులు ప్రాధాన్యంగా ఉంటాయని స్థానికుల కథనం.






