
నటి రెజీనా (Regena) సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు గడిచాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు. 20 ఏళ్ల కెరీర్‌ను ఓ మైల్ స్టోన్‌గా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైందన్నారు. అయితే తాను కొన్ని విషయాల్లో టాప్ ప్లేస్‌లో లేనని రెజీనా (Regina Cassandra) పేర్కొన్నారు.
యాక్టింగ్ మానేయాలనుకున్నా..
‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒకానొక సమయంలో కెరీర్ డల్ అయ్యింది. 2015–16 కాలంలో నాకు పని చేయాలనిపించలేదు. యాక్టింగ్ మానేయాలనుకున్నా. కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేశాను. కానీ ఊహించకుండా 2018 నుంచి అవకాశాలు వరుసపెట్టాయి. అయితే ఒకేతరహా క్యారెక్టర్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నా. టాలీవుడ్లోకి వెళ్లిన మొదట్లో ఉదయం 6 గంటలకే నాకు డైలాగ్ పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. అప్పుడు నాకు తెలుగు రాదు. దీంతో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అన్ని డైలాగులు కంఠస్థం చేశాను. భావోద్వేగాలను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలను’ అని పేర్కొన్నారు.
2005లో తమిళ మూవీతో ఎంట్రీ..
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా ఇంపార్టెన్స్ తెలియలేదని, కానీ కొంతకాలం తర్వాత తెలిసిందన్నారు. ‘ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నటించి, ఇంటికి వచ్చేయడమే అని భావించా. కానీ, ఆ తర్వాత పీఆర్ లు, సోషల్ మీడియా ప్రాధాన్యం గురించి అర్థమైంది. నేను వీటికి చాలా రోజులు దూరంగా ఉన్నాను. నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి కానీ, పబ్లిసిటీ చూసి కాదని అనుకున్నా. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే నా పనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నా” అని అన్నారు. 2005లో ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రెజీనా.. 2010లో ‘ఎస్ఎమ్ఎస్’ (SMS) మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ (Pilla nuvvuleni Jeevitham), ‘అ..!’, ‘ఎవరు’, ‘జ్యో అత్యుతానంద’ తదితర సినిమాల్లో నటించింది.