తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట (Tirupati Stampede)పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని తెలిపారు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని వెల్లడించారు.
అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం
మరోవైపు అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని.. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని వెల్లడించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక అందించినట్లు కలెక్టర్ (Tirupati Stampede Case) తెలిపారు.
ఇదీ జరిగింది..
వైకుంఠ ఏకాదశిని (vaikuntha ekadashi) పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మందికిపైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.








