
గాజాలో (Gaza) తీవ్ర ఆకలితో ప్రజలు అల్లాడుతున్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర పోరు మధ్య ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాగునీరు, తినడానికి తిండి దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే వివిధ దేశాల వారు పంపించిన ఆహార ధాన్యాలు గిడ్డంగుల్లో ఉన్నాయి. దీంతో ఆ గిడ్డంగుల వద్ద భారీగా ప్రజలు గుమిగూడుతున్నారు. తినడానికి తిండి లేదని ఆకలితో అలమటిస్తున్నామని సాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఓ గిడ్డంగి వద్ద జరిగిన తోపులాటలో ఇద్దరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి.
తోపులాటలో ఇద్దరి మృతి
గాజాలోని డీర్ అల్ బలాహ్‌లోని (Palestine) ఆహార పదార్థాల గిడ్డంగిపై ప్రజలు దాడి చేసి గోధుమపిండి, ఇతర ఆహార పదార్థాలను లూటీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాలను తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు చనిపోయారు. దీంతో పాటు అక్కడ ప్రజలంతా గుమిగూడిన సమయంలో జరిగిన తోపులాట వద్ద పేలుళ్లు జరిగినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.
54 వేల మంది మృతి
ఐక్యరాజ్యసమితి (United Nations) వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన వందలాది ట్రక్కుల్లో మానవతా సాయం బుధవారం గాజాలోకి ప్రవేశించినట్లు ఇజ్రాయిల్ అధికారులు పేర్కొన్నారు. గాజాకు అందిస్తున్న సాయాన్ని హమస్ తమ వైపు మళ్లిస్తోందనే ఆరోపణలను ఐరాస ప్రతినిధి జొనాథన్ విఠల్ ఖండించారు. ఇజ్రాయిల్ లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులు దాటే సమయంలో ఆహార పదార్థాలు నిల్వ ఉన్న ట్రక్కులను హామస్ దోచుకుంటుందని ఆరోపించారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ (Israel) – హమాస్‌ల మధ్య జరుగుతోన్న పోరులో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.