Mana Enadu : దక్షిణ కొరియా (South Korea)లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol)పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ విధించి తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల ఆ ప్రకటనను విరమించుకున్న దేశాధినేత రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. కొన్ని గంటల్లోనే తలకిందులైన ఆ దేశ రాజకీయం.. వరుసగా నెలకొన్న అనూహ్య పరిణామాలు కొరియా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు దక్షిణ కొరియాలో ఏం జరుగుతోంది..
ఎమర్జెన్సీ మార్షల్ లా రగడ
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ మంగళవారం సాయంత్రం ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Emergency Martial Law) విధించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చేసేదేం లేక చివరకు యూన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నారు. అయినా కూడా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశాధినేతలపై అభిశంసన తీర్మానం
ఈ నేపథ్యంలో ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడంతో మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు. తాజాగా ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ దక్షిణ కొరియా అధ్యక్షుడి (South Korea President)పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ఆయన ఈ గండం గట్టెక్కాలంటే.. పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం.
200 మంది మద్దతు అవసరం
300 మంది సభ్యులు ఉన్న దక్షిణకొరియా పార్లమెంట్‌లో అభిశంసన(impeachment)ను గట్టెక్కాలంటే దేశాధినేతకు 200 మంది సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాలి. ఈ తీర్మానాన్ని శుక్రవారంలోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ తెలిపారు. అయితే యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెప్పడం గమనార్హం.