Mana Enadu : హైదరాబాద్ మహా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని జూబ్లీహిల్స్(Jubileehills)లో భారీ పేలుడు సంభవించడంతో దాని ప్రభావం పక్కనున్న బస్తీపై పడింది. పేలుడు శబ్ధం విని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో తెలంగాణ స్పైస్ కిచెన్ (Spice Kitchen) పేరుతో ఉన్న హోటల్‌లో ఆదివారం (నవంబరు 10వ తేదీ) ఉదయం అందులోని ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనతో హోటల్ ప్రహరీ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరి పడ్డాయి. ఈ రాళ్లు 100 మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడటంతో నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి. పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ఓ మహిళ గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎమ్మెల్యే పర్యటన
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. హోటల్ నిర్వాహకులతో డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మాట్లాడారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఘటనా స్థలిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.