
పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ప్రకటించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం గతంలో ఆన్లైన్లో లేదా మీ-సేవలో దరఖాస్తు చేసే విధానం ఉండేది. తాజాగా మాత్రం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు నేరుగా అధికారులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పంచాయితీల్లో గ్రామ సభలు,నగరాల్లో బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులనుఈనెల 15నుంచి స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించనున్నారు.పదిరోజుల్లోనే యంత్రాంగం అర్హులకు జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేలా సన్నద్దం అవుతున్నారు.
ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను అప్రూవల్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివాహమయ్యాక పుట్టింటి రేషన్ కార్డుల్లో పేర్లను తీసేసుకున్న మహిళలు, మెట్టినింటి కార్డుల్లో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు రేషన్ కార్టులో చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలకు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షలకు పైగా పేర్లు ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సారి రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపం ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రీ డిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి డిజైన్ రూపకల్పనపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో చర్చించాలని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.