
హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేసు (Formula E Race Case) కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఊరట లభించింది. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఆయన వినతిని కోర్టుకు అంగీకారం తెలిపింది. లాయర్ ను ఆయనతోపాటు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ముందుగా ముగ్గురు న్యాయవాదుల పేర్లను కోర్టుకు తెలపాలని వారిలో.. ఒకరు కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతిస్తామని న్యాయస్థానం తెలిపింది.
9న విచారణకు రండి
ఈ నెల 6వ తేదీన కేటీఆర్‌ను ఏసీబీ (KTR ACB Case) విచారణ చేయాల్సింది. అందుకోసం ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తన లీగల్ టీమ్ తో వెళ్లారు. అయితే ఆఫీసు గేటు వద్దే వారిని నిలిపివేసిన పోలీసులు న్యాయవాదిని లోపలికి అనుమతించలేదు. దీంతో లాయర్ లేకుండా విచారణకు హాజరుకాలేనంటూ ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అదే రోజు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఏసీబీ విచారణకు అర్వింద్
ఇక ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా అరవింద్ కుమార్ నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. 45కోట్ల 71 లక్షలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.