ManaEnadu:కృష్ణాష్టమి పురస్కరించుకుని నటి, బీజేపీ నేత నమిత మదుర మీనాక్షి దేవాలయం వెళ్లగా అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సిబ్బంది తనతో అగౌరవంగా ప్రవర్తించారని, తనను దేవాలయంలోనికి వెళ్లనివ్వలేదని ఆరోపించారు. ఈమేరకు ఆమె వీడియో రిలీజ్ చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లగా.. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారని తెలిపారు.
తనకు సంబంధించి హిందూ కుల సర్టిఫికెట్స్ చూపించమని అడిగారని నమిత తెలిపారు. ఈ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని వెల్లడించారు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు చెప్పినా వారు వినిపించుకోలేదని పేర్కొన్నారు. తాను పుట్టుకతోనే హిందువునేనని.. తనతో అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ అధికారుల తీరు తనను ఎంతో బాధకు గురి చేసిందని పేర్కొన్నారు.
నమిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడామని.. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పామని తెలిపారు. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించామని వెల్లడించారు.






