
పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అయితే అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పార్లమెంట్ (Parliament)లోకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి.
రాహుల్ గాంధీ కారణంగానే కిందపడ్డా
ఈక్రమంలో బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజ్‌పుత్ (MP Mukesh Rajput), ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కిందపడ్డారు. ఈఘటనలో వారిద్దరికి గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. ముఖేశ్ రాజ్ పుత్ పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని, ప్రతాప్ చంద్ర సారంగి తలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ఈసందర్భంగా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి (MP Pratap Chandra Sarangi) మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కారణంగానే తాను కిందపడినట్లు ఆరోపించారు. ‘నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడటంతో నేను కిందపడ్డాను’ అని అన్నారు.
బీజేపీ ఎంపీలు నన్ను బెదిరించారు: రాహుల్ గాంధీ
ఈ ఘటనపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. బీజేపీ ఎంపీలు తనను బెదిరించారని ఆరోపించారు. ‘జరిగిందంతా మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ, వారు అడ్డుకుంటున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ’ అని మండిపడ్డారు.