
మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత పార్టీ విధివిధానాలపై సూచనలు చేస్తూ లేఖ రాస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుకి లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. కేసీఆర్ కు సూచనలు చేయాలనుకున్న వారు లేఖలు రాయొచ్చని కేటీఆర్ సూచించారు. అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడాలని సూచనలు చేశారు. ఏ పార్టీలో అయినా కోవర్టులు ఉంటారని సమయం వచ్చినపుడు వారే బయటపడతారని కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు.
రేవంత్ రెడ్డి డబ్బు మూటలు మోసే సీఎం
సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బుల మూటలు పంపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని మూటల సీఎం అని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జీషీటులో సీఎం రేవంత్ రెడ్డి పేరున్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినా కేంద్రమంత్రులు ఇతర సీఎంలు తప్పుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. సీఎంను కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వమే అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..
కర్ణాటకలో హౌసింగ్ స్కీంలో అప్పటి సీఎం యడ్యూరప్ప రిజైన్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత తెల్లవారి లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతారు.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) డీఎన్ఏలోనే అవినీతి ఉందని ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పామన్నారు. ఈ కుంభకోణంపై దేశమంతా ప్రశ్నిస్తున్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. బీజేపీ ఎంపీల భూదందాలకు సీఎం రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.