పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, కిరెన్ రిజిజు, వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్, తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక బిల్లుల ఆమోదానికి సహకారం, రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలపై చర్చ జరగనుంది. వక్ఫ్ సవరణ బిల్లుతో సహా 16 బిల్లులను పరిశీలించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ చేసింది.
ఈ నెల 25 నుంచి కొనసాగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ (one nation one election) బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ సవరణ బిల్లు, (Waqf Amendment Bill) చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలను అఖిలపక్షంలో విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు. సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం ఏపీలోని ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా చేసుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఎలా తీసుకు రావాలనేది ఒక డాక్యుమెంట్‌తో తాము ముందుకెళ్లామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్.. ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.