చైనాలో హెచ్ఎంపీవీ (HMPV Virus) కలకలం సృష్టిస్తోన్న వేళ ప్రపంచదేశాలు భయంతో వణికిపోతున్నాయి. భారత్‌లోనూ ఆ వైరస్ అడుగుపెట్టింది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసినట్లు ఐసీఎంఆర్ (ICME) వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధరాణ అయిందని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అయితే అప్రమత్తతే అసలైన శ్రీరామరక్ష అని పేర్కొంది.
ఆ మార్పుల వల్లే కొత్త వైరస్
చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (China New Virus HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) నిర్వహించిన సమావేశంలో.. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు తేల్చారు.
మాస్కు పెట్టుకో గురూ
అయితే భారత్‌లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేఎంజీ తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల RSA, HMPV తదితర పరీక్షలు చేస్తున్నట్లు తెలిపిన ఆరోగ్య శాఖ .. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని అధికారులు తెలిపారు. మాస్కు (Mask) తప్పకుండా ధరించాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రంగా శానిటైజర్ తో కడుక్కోవాలని తెలిపారు.






